PriyaNechhali
Friday, June 17, 2011
Thursday, July 8, 2010
నా మొదటి ఆట స్థలం
ఆహా ఆ మాట చెప్పగానే తామర తంపరగా నా చిన్ననాటి ముచ్చట్లు, జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.నాకు ఊహ తెలిసే నాటికి ఉన్న మా ఇల్లు చాలా పెద్ద స్థలంలో బోలెడు పూల మొక్కలు, కూరగాయలు మొక్కలు , కూర అరటి చెట్లు, దబ్బ చెట్టు , రెండు సుబాబుల్ చెట్లు, దేవుడి పూజకి సువర్ణ గన్నేరు, పారిజాతం, మందారం , కార్తీక మాసంలో వన బోజనానికి ఉసిరిక చెట్టు, పిల్లలం తినటానికి తినే ఉసిరిక చెట్టు,బొప్పాయి చెట్టు (ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి లిస్టులో) లతో నిండి ఉండేది అడవి లాగా. అందులో నాకు బాగా ఇష్టమైన చెట్టు దబ్బ చెట్టు.అదుగో అక్కడే మా నాన్న గారు ఇంటి మరమ్మత్తుల కోసం రెండు రకాలైన ఇసుక తోలించారు.ఒకటి మెత్తటి ఇసుక, రెండవది కొంచెం బరకగా ఉండే ఏటి ఇసుక.ఆ మెత్తటి ఇసుకే నా మొదటి ఆట స్థలం నాకు గుర్తు ఉండి.అందులో బోలెడు కట్టడాలు కట్టేదానిని గుడి,బడి,నా స్వంత ఇల్లు , ఒకటేమిటి మా ఊరిలో ఎన్ని రకాలు కనిపిస్తే అన్నీ కట్టేయటమే. అందులో నాకు మరీ మరీ ఇష్టమైనది గుడి.ఇక దానిని అలంకరించటం తో మొదలయ్యేది నా తిప్పలు మరియు మా ఇంట్లో వాళ్ళ తిప్పలూనూ.మొట్ట మొదటిగా బలి అయ్యేది మా నాన్న గారు ప్రాణప్రదంగా చూసుకునే పూల మొక్కలు.నాకు ఏమేమి రంగులు కావాలో అన్ని రంగులు మా ఇంట్లో నాకు దొరికేవి.ఇక వాటిని తెంపుకుని రావటమే మన పని ఆనక మా నాన్నగారి మోహంలో కనిపించే కోపాన్ని , నోటి నుండి వచ్చే తిట్లని భరించటం మా అమ్మ పని.దానికి మనకి అస్సలు సంభంధం ఉండేది కాదు.వాటిని అందంగా అలంకరించటానికి ఇక మా అన్నయ్య వెనక పడేదానిని.మా అన్నయ్య , నేను అప్పుడప్పుడు మా అక్క సహాయంతో కలసి గుడిని ఎంతో చక్కగా అందంగా అలంకరించేవాళ్ళం.తరువాత వెంకటేశ్వర స్వామి బొమ్మ ని తెచ్చి లోపల ఉంచే వాళ్ళం.ఈలోపలే మేము చేస్తున్న ఘనకార్యాన్ని గమనించి మా చుట్టు పక్కల ఉన్న పిల్లలందరూ నా సామ్రాజ్యంలోకి అడుగిడే వారు.ఇక అప్పుడు చెప్పాలి మా సందడి చుట్టు పక్కల వాళ్ళ చెవులు బద్దలయ్యేలా గొడవ గొడవగా అరుచుకుంటూ , తుళ్ళుతూ, తిరుగుతూ, ఒకరకి ఒకరం ఇంకెంత అందంగా అలంకరించవచ్చో సలహాలు ఇచ్చుకుంటూ అబ్బో ఆ అనుభవమే వేరు .నైవేద్యానికి మా అమ్మ అంతక ముందే ఇంట్లో దేవుడికి పెట్టిన ఫలహారం తీసుకొచ్చే వాళ్ళం నేను మా అన్నయ్య కలసి.దీనికి ఎటువంటి అడ్డంకి ఉండేది కాదులెండి.ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడేది నాకు.పుట్టి బుద్ది ఎరిగినప్పటి నుండి మా తాతయ్య దేవుడి కార్యం అనగానే చన్నీటి స్నానం చేసి , పట్టు పంచ కట్టుకొని , స్టీలు బిందె మరియు బావిలో నీళ్ళు తోడటానికి తాడు తీసుకొని వెళ్లి నీరు తీసుకొని వచ్చి శివుడికి అభిషేకం తో పూజని ప్రారంభించే వారు.ఈలోపు మా నాన్న గారు నందివర్ధనం, శివకాశీ, ఎర్ర గన్నేరు పూలు కోసి దేవుడి గదిలో పెట్టే వారు.పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టి బయటకి వచ్చి తలుపులు మూసేవారు.ఒక అరగంట గడిచాక ఆ నైవేద్యాన్ని మా పిల్ల గ్యాంగ్ కి పంచే వారు.ఇది రోజు వారీ దినచర్య.అటువంటి దినచర్యలో నా బుర్రలోకి ఎక్కింది ఒక్క పట్టు పంచ మాత్రమే.యువరాణి తలుచుకుంటే పట్టు దుస్తులకి కొరవా! మా అమ్మ గారికి తిప్పలు మొదలు.నాకు ఉన్న పట్టు లంగా వేసుకోమంటే కుదరదు అనేదాన్ని.అమ్మాయిని కనుక పట్టు చీర కట్టుకొని మాత్రమే పూజ చెయ్యాలని చెప్పే దాన్ని.మరి నన్ను చీరలో చూడాలన్న కోరికో లేక నా మొండితనం ముందు నుండి అనుభవమవటం వలనో కానీ మా అమ్మ గారు , వాళ్ళ అమ్మమ్మ గారు మా అమ్మ గారి పెళ్ళికి కొని పెట్టిన ఎర్ర సింధూరమ్ రంగు అంచు ఉన్న ముదురాకు పచ్చ చీరని నాకోసం త్యాగం చేసేసారు.అసలైన పండగ మొదలు అప్పుడే. మా అమ్మ గారే కష్టపడి పిన్నులు పెట్టి , అంచు రంగు జాకెట్ నా స్కర్ట్ మీదదే వేసి ముస్తాబు చేసి పంపేవారు ఆడుకోవాటానికి.తల్లి మనసు కదా....చీర పాడు అవుతుందేమో , తారువాత ఎప్పుడైనా వాళ్ళ అమ్మమ్మ గారు చూస్తే నోచ్చుకుంటారేమో అన్న భయమే ఉండేది కాదు.ఇక ఇంట్లో పూజ గదిలో ఉన్న హారతి పళ్ళెం , గంట తో మనం పూజారి అవతారం ఎత్తేవాళ్ళం. అచ్చు మా తాతయ్య చేసినంత శ్రద్దగా పూజ చేసి మిగతా వారి చేత కూడా చేయించేదానిని.నాకు మంత్రాలు కూడా వచ్చండొయ్.గణపతి పూజ మొదట చేసి, హనుమంతునికి నమస్కారం చేసి ఆనక మిగతా దేవుళ్ళకి నమస్కారం చేసే వాళ్ళం.పూజ సమాప్తం అయ్యాక మా తాత గారిలాగే ఆ గుడికి గట్టిగా ఉన్న లీపాక్షి నోట్ బుక్ అట్ట ముక్కని తలుపుగా అడ్డం పెట్టి ఒక అరగంట ఆగాక తీసి నైవేద్యాన్ని తినేసే వాళ్ళం పిల్లలందరం కలిసి.ఈ తతంగమంతా మా అక్క, అన్నయ్య పర్యవేక్షణలో జరిగేది.కాకపోతే ఇంట్లో చిన్నదాన్ని కావటం మూలాన తప్పు ఒప్పులను మన ఖాతాలో వేసేవారు.ఇక చివరగా మా నాన్న గారు అన్నం ప్లేటు పట్టుకొని మా గుడి దగ్గరకి వచ్చి పిచ్చ పిల్లల్లారా ఏంటి మట్టిలో ఆటలు వెళ్లి స్నానం చెయ్యండి పొండి అనే వరకు అవి అలా అలుపు సొలుపు లేకుండా సాగుతూనే ఉండేవి.కాకపోతే ఈ సమయం లో మా నాన్న గారికి మా మీద ఉన్న అవాజ్యమైన ప్రేమని మీతో పంచుకోవాటానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే , నా ఆటల కోసం ఆ ఇసుకని ఎప్పటికి అక్కడే ఉంచి ఇంటి పనుల కోసం వేరే మూల మళ్ళా ఇసుక తోలించారు.ఇప్పటికే బాగా లేట్ అయ్యింది.నేనొక కబుర్ల పుట్టని.మళ్ళా వస్తానండి ఇంకొన్ని చిన్ననాటి కబుర్లతో.అందాకా సెలవు మిత్రమా.
Tuesday, July 6, 2010
నా బ్లాగ్ ని విజిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ బ్లాగ్ కేవలం నా మనసులోని ఆలోచనలని, ఆకాంక్షలని, ఆశలని మరియు అభిప్రాయాలని స్వేచ్చగా చెప్పటానికి మాత్రమె.వాటిలోని మంచి చెడులని విశ్లేషించి , తెలిసి తెలిసి ఇతరులని నొప్పించకుండా సహృదయంతో వారి మనసులోని భావాలని పంచుకోవాలి అనుకునే స్నేహ ప్రియులకి ఇదే మీ ఈ ప్రియ నెచ్చలి సుస్వాగతం. నేను చెప్పబోయే కబుర్లు కొందరకి అచ్చు వాళ్ళ జీవితంలో జరిగినట్లో లేక ఎవరి వద్ద ఐనా విన్నట్లో ఉండొచ్చు. అటువంటి కబుర్లు కొన్ని మనసుని సంతోష పెట్టను వచ్చు లేదా బాదించవచ్చు.అందరకి నా మనవి ఒక్కటే.ఎవర్నీ నొప్పించటానికో ఒప్పించటానికో మాత్రం కాదు నేను ఈ కబుర్లు చెప్పేది.నచ్చిన వారికీ నా ఈ చిన్ని ప్రపంచంలోకి సదా ద్వారాలు తెరిచే ఉంటాయి.నొచ్చిన వారికి కలిగిన బాధని స్వచ్చమైన నా చిరునవ్వు తొలగిస్తుంది అని భావిస్తూ....... అభిమానంతో....... మీ ప్రియ నెచ్చలి.
Subscribe to:
Posts (Atom)